భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
జమ్మూ కాశ్మీర్‌లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, పహల్గామ్ మరియు బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి అమర్‌నాథ్ యాత్రను గురువారం తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ సమాచార శాఖ అధికారికంగా ప్రకటించింది.
కుండపోత వర్షాల ప్రభావంతో యాత్ర మార్గాల్లోకి నీరు చేరడంతో ట్రాక్‌లు ప్రమాదకరంగా మారాయి. అధికారులు అత్యవసర పునరుద్ధరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో యాత్రను ఒక రోజు పాటు నిలిపివేసినట్టు తెలిపారు.
“గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ట్రాక్‌లపై మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి ఈ రోజు యాత్రను నిలిపివేశాం,” అని జమ్మూ కాశ్మీర్ ప్రజా సంబంధాల విభాగం పేర్కొంది.
కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధురి కూడా యాత్ర నిలిపివేతను ధృవీకరించారు. వాతావరణ పరిస్థితులను బట్టి రేపటి నుంచి యాత్ర మళ్లీ ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు.
ఈ నెల 3న యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 2.35 లక్షల మందికి పైగా భక్తులు అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించారు. అంతేకాకుండా 4 లక్షలకు పైగా భక్తులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 9న ముగియనుంది.