క్వార్క్స్ టెక్నోసాఫ్ట్‌కి ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ – విశాఖలో కొత్త ఐటీ క్యాంపస్
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలోని కాపులుప్పాడ ప్రాంతంలో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఎకరా కోటి రూపాయల చొప్పున మొత్తం 4 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.115 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. దీని ద్వారా సుమారు 2 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
ఈ క్యాంపస్‌లో అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతిక విభాగాలను అభివృద్ధి చేయనున్నారు. ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 కింద కంపెనీకి ప్రభుత్వం అవసరమైన ప్రోత్సాహకాలను అందించనుంది.
ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఒప్పందం కుదిరిన నాటి నుంచి రెండేళ్లలోపు తొలి దశ కార్యకలాపాలు ప్రారంభించాలని, మొత్తం ప్రాజెక్టును ఐదేళ్లలోగా పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగం కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఏపీటీఎస్, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో విశాఖ ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.