సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈ నెల 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తి పర్యటించనుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లను మరింత వేగవంతం చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, రవాణా సదుపాయాలు సజావుగా కొనసాగేందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులు — గోపాలకృష్ణ, గోవిందరావు, కల్యాణ్ చక్రవర్తులను ప్రత్యేక పర్యవేక్షణ బాధ్యతల కోసం నియమించింది. ప్రధాని పర్యటన పూర్తయ్యే వరకు వీరు పుట్టపర్తిలోనే ఉండి అన్ని ఏర్పాట్లను సమన్వయం చేస్తారు.
అదనంగా సమీప జిల్లాలకు చెందిన ఒక జాయింట్ కలెక్టర్ (జేసీ), తొమ్మిది మంది డిప్యూటీ కలెక్టర్లకు కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక మరోవైపు ఏర్పాట్ల పురోగతిపై మంత్రుల బృందం సమీక్ష సమావేశం నిర్వహించింది. కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత, అలాగే శతజయంతి ఉత్సవాల నోడల్ అధికారులు ఎంటీ కృష్ణబాబు, వీరపాండియన్‌లతో సమీక్షించారు. ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, పలువురు ముఖ్య అతిథులు పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు.