తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ కళాశాలల్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. విద్యార్థులు డిగ్రీ పూర్తయ్యాక తక్షణమే ఉద్యోగ అవకాశాలు పొందేలా కొత్త సిలబస్‌తో పాటు కోర్సులను అందుబాటులోకి తేనుంది. అన్ని సక్రమంగా జరిగితే, ఈ కోర్సులు వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమయ్యే అవకాశముంది.
అధికారుల సమాచారం ప్రకారం, బీఏ డిఫెన్స్ సైన్స్ & సెక్యూరిటీ సహా మొత్తం 18 కొత్త కోర్సులు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు. వీటిని మొదట ఎంపిక చేసిన కొన్ని కాలేజీలలో ప్రారంభించి, విద్యార్థుల స్పందనను బట్టి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ విషయాన్ని ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు.
కొత్త కోర్సులతో పాటు, అన్ని డిగ్రీలకూ ఒకే విధమైన సిలబస్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి సబ్జెక్టుకు 30 నుంచి 40 ప్రశ్నలతో కూడిన మెటీరియల్ విద్యార్థులకు అందించాలనే యోచన ఉంది. ఇదే విధంగా జేఎన్టీయూ సిలబస్ లోనూ మార్పులు చేయనున్నారు. ఇప్పటికే ఆర్-22 సిలబస్ గడువు ముగియడంతో, ఆర్-25 అనే కొత్త సిలబస్‌ను రూపొందిస్తున్నారు. ఇది ఇంటర్న్‌షిప్‌లు మరియు ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా రూపొందించబడుతుంది. యూజీసీ అనుమతితో ఈ 18 కొత్త కోర్సులను ఉన్నత విద్యా మండలి అందుబాటులోకి తీసుకురానుంది.