‘శుభం’తో నిర్మాతగా మారిన సమంత – హారర్ కామెడీ ప్రయోగం
సాధారణంగా సినిమాకి చివర్లో ‘శుభం’ అని చూపిస్తారు. కానీ సమంత మాత్రం అదే శుభం అనే టైటిల్‌తో నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టారు. ఆమె నిర్మించిన తొలి సినిమా ‘శుభం’, హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందింది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం సమంతకు నిర్మాతగా విజయాన్ని ఇచ్చిందా? ఇందులో ఏమి ప్రత్యేకం? ఇప్పుడు చూద్దాం.
కథ:
భీమునిపట్నానికి చెందిన శ్రీను (హర్షిత్ రెడ్డి) తన స్నేహితులు (గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి)తో కలిసి కేబుల్ టీవీ నెట్‌వర్క్‌ను నడుపుతుంటాడు. డీటీహెచ్ పోటీగా వచ్చి, డిష్ కుమార్ (వంశీధర్ గౌడ్) గ్రామంలో తన సేవలు ప్రారంభిస్తాడు. ఇదిలా ఉండగా శ్రీను బ్యాంక్ ఉద్యోగిగా ఉన్న శ్రీవల్లిని (శ్రియ కొంతం) వివాహం చేసుకుంటాడు. పెళ్లి రాత్రే అతడి భార్య టీవీలో సీరియల్ చూస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఇదే పరిస్థితి అతని స్నేహితుల ఇళ్లలోనూ కనిపిస్తుంది.
ఈ పరిస్థితికి పరిష్కారం కోసం వాళ్లు మాయ మాతాశ్రీ (సమంత) దగ్గరకు వెళతారు. "జన్మ జన్మల బంధం" అనే టీవీ సీరియల్‌కి ఆత్మలకు ఉన్న సంబంధం ఏమిటి? ఆత్మల ప్రభావం నుంచి ఊరి మహిళలు విముక్తి పొందారా? మిగతా కథలో తెలుస్తుంది.
విశ్లేషణ:
హారర్ కామెడీ జోనర్ ఎప్పుడూ ఆకర్షణీయమే. ఈ చిత్రంలో టీవీ సీరియల్స్ నేపథ్యాన్ని వినూత్నంగా చూపించడమే ప్లస్ పాయింట్. కథలో ట్విస్టులు ఆసక్తిని పెంచినా, హారర్ సీన్లను ఆశించినంత బలంగా చూపించలేకపోయారు. పాత్రల పరిచయాలు కొంత సాగదీసినట్లుగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సినిమాకు బలాన్నిస్తుంది, కానీ సెకండ్ హాఫ్‌లో పునరావృతం ఎక్కువగా కనిపిస్తుంది.
'ఆల్ఫా మేల్' కాన్సెప్ట్‌ను బాగా వాడుంటే సినిమా వేగంగా ముందుకు నడిచేది. అయినా సరే, కుటుంబంతో కలిసి నవ్వుతూ భయపడేలా చూసే సినిమా కావడంతో ఓ మోస్తరుగా బాగుంది.
నటీనటులు, సాంకేతిక వివరాలు:
నూతన నటీనటులు సరిగ్గా నటించారు, అయితే మరింత అభ్యాసం అవసరం. మాయ మాతాశ్రీగా సమంత తనదైన హాస్యంతో ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ, సంగీతం సంతృప్తికరంగా ఉన్నాయి. దర్శకుడు స్క్రీన్‌ప్లేను మరింత పటిష్టంగా చేసుంటే, సినిమా మరింత మెరుగ్గా ఉండేదని చెప్పొచ్చు. కొత్త ప్రయత్నాలను ఆదరించే ప్రేక్షకులకు ఇది ఓసారి చూడదగిన సినిమా.
సినిమా వివరాలు:
-
సినిమా పేరు: శుభం
-
విడుదల తేదీ: 2025-05-09
-
నటీనటులు: సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్
-
దర్శకుడు: ప్రవీణ్ కండ్రేగుల
-
సంగీతం: క్లింటన్ సెరెజో, వివేక్ సాగర్
-
బ్యానర్: ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్
-
సమీక్ష: మధు
-
రేటింగ్: ⭐ 2.75/5