ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, నీట్, ఈఏపీసెట్ వంటి పోటీ పరీక్షల కోసం ఉచిత కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. కార్పొరేట్ కాలేజీల స్థాయిలో విద్య అందించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రతి రోజూ తరగతుల అనంతరం విద్యార్థులకు కోచింగ్ నిర్వహించనున్నారు.
ఈ కోచింగ్‌లో గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం అంశాల్లో నిపుణులైన అధ్యాపకులు బోధిస్తారు. ప్రభుత్వ అధ్యాపకులకూ ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 2025 నుంచి చేపట్టిన విద్యా సంస్కరణల్లో భాగంగా పేద విద్యార్థులను IIT, NIT, వైద్య, ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశాలకు సిద్ధం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రభుత్వమే స్టడీ మెటీరియల్స్‌ను ఉచితంగా అందించనుంది. కోచింగ్ నిర్వహణ కోసం జూనియర్ కాలేజీల సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచారు. ఇందులో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు కోచింగ్‌కే కేటాయిస్తారు. ఈ కార్యక్రమం పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు.