అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా సంచలన నిర్ణయం విదేశీ చిత్ర పరిశ్రమలపై, ముఖ్యంగా అమెరికాలో పెద్ద మార్కెట్ కలిగిన తెలుగు సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్టు చేసిన ప్రకారం, అమెరికాకు దిగుమతి చేసే అన్ని విదేశీ చిత్రాలపై తక్షణమే 100 శాతం సుంకం (టారిఫ్) విధించాలని ట్రంప్ ఆదేశించారు. అమెరికన్ ఫిల్మ్ స్టూడియోలు విదేశీ ప్రోత్సాహకాల వల్ల తమ దేశాలు వదిలి వెళ్లిపోతున్నాయని ఆయన ఆరోపించారు. ఇది జాతీయ భద్రతకు ముప్పుగా మారుతోందని, విదేశీ సినిమాలు అమెరికా వ్యతిరేక సందేశాలు పంపిస్తున్నాయని అన్నారు.
ఈ నిర్ణయం వల్ల అమెరికాలో తెలుగు సినిమాల విడుదల ఖర్చు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. పంపిణీదారులు ఈ అదనపు భారాన్ని టికెట్ ధరల పెంపు రూపంలో ప్రేక్షకులపై మోపే అవకాశముంది. ఫలితంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోవచ్చు. ఇప్పటికే తెలుగు సినిమాలు యూఎస్ బాక్సాఫీస్‌లో మిలియన్ డాలర్ క్లబ్ చేరిన ఉదాహరణలు ఉన్నా, ఇప్పుడు చిన్న, మధ్య తరహా చిత్రాల విడుదల ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. పెద్ద బడ్జెట్ సినిమాలే ఈ సుంకం భారాన్ని మోయగలవని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ సుంకం థియేటర్ విడుదలలకేనా లేక స్ట్రీమింగ్ కంటెంట్‌కు కూడా వర్తిస్తుందా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అంతేకాకుండా, ఇది విదేశీ నిర్మాణ సంస్థలకేనా లేక విదేశాల్లో షూటింగ్ చేసే అమెరికన్ కంపెనీలకా అన్నదీ తెలియాల్సి ఉంది. ఈ పరిణామం తెలుగు సినిమాల ఓవర్సీస్ మార్కెట్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.