రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 8.8గా నమోదు అయ్యింది. ఈ భూకంపం రష్యా తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది. విశ్లేషకుల ప్రకారం, 2011 తర్వాత ఇంత తీవ్రతతో వచ్చిన భూకంపం ఇదే మొట్టమొదటిది. భూకంపం వచ్చిన వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ భూకంపం కారణంగా కంచట్కా మరియు పెట్రోపావ్లోవ్‌స్క్ నగరాల్లో పలు భవనాలు తీవ్రంగా కంపించాయని రష్యా మీడియా తెలిపింది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్‌లలో అంతరాయాలు ఏర్పడ్డాయని సమాచారం.
ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం గురించి అధికారిక సమాచారం లేదు. అధికారులు పరిస్థితిని దగ్గర నుండి పరిశీలిస్తున్నారు.