క్యాన్సర్‌పై రష్యా సంచలనం – ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత ‘ఎంటర్‌మిక్స్’ వ్యాక్సిన్
ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిని ఎదుర్కోవడంలో రష్యా శాస్త్రవేత్తలు కీలక విజయాన్ని సాధించారు. ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీ ఆధారంగా “ఎంటర్‌మిక్స్” అనే కొత్త టీకాను అభివృద్ధి చేశారని ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ (FMBA) ప్రకటించింది.
మూడు సంవత్సరాలుగా కొనసాగిన ప్రీ-క్లినికల్ పరిశోధనల్లో ఈ టీకా అద్భుత ఫలితాలు ఇచ్చిందని, కణితుల పెరుగుదలను 60% నుంచి 80% వరకు తగ్గించగలిగిందని ఏజెన్సీ అధిపతి వెరోనికా స్క్వోర్త్సోవా తెలిపారు. అలాగే, ఇది అత్యంత సురక్షితమని, ప్రయోగ జంతువుల మనుగడ రేటు గణనీయంగా పెరిగిందని చెప్పారు.
మొదట ఈ వ్యాక్సిన్‌ను పెద్దప్రేగు క్యాన్సర్ చికిత్స కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. అంతేకాకుండా, మెదడు క్యాన్సర్ (గ్లయోబ్లాస్టోమా), కంటి క్యాన్సర్, అలాగే చర్మ క్యాన్సర్ (మెలనోమా) వంటి వ్యాధులపై కూడా పరిశోధనలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
కరోనా సమయంలో ఉపయోగించిన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ టెక్నాలజీనే ఇందులో వినియోగించడం విశేషం. ఈ విధానం ద్వారా శరీరంలోని కణాలు ప్రత్యేక ప్రోటీన్లను ఉత్పత్తి చేసి క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడానికి రోగనిరోధక వ్యవస్థను శక్తివంతం చేస్తాయి.