ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రభుత్వం కొత్త విధానాలు ప్రవేశపెట్టింది. ర్యాపిడ్ టెస్టింగ్ మొబైల్ కిట్లను స్పాట్‌లోనే రేషన్ బియ్యాన్ని గుర్తించడానికి ఉపయోగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కిట్లను విశాఖపట్నంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు.
మంత్రి మనోహర్ మాట్లాడుతూ, పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు చేపట్టారని, రేషన్ బియ్యాన్ని తక్షణమే పరీక్షించి, దాని మూలాన్ని గుర్తించేలా ఈ మొబైల్ కిట్లను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 700 మొబైల్ కిట్లను అందుబాటులో ఉంచారు. కిట్లలో బియ్యం ఎరుపు రంగులోకి మారితే అది రేషన్ బియ్యంగా గుర్తించవచ్చని ఆయన వివరించారు. ఈ విధానం ద్వారా పి.డి.ఎస్. బియ్యం అక్రమ వినియోగం, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం సులభమవుతుందని మంత్రి పేర్కొన్నారు.