వృద్ధులు, దివ్యాంగులకు నేటి నుంచే రేషన్ డోర్ డెలివరీ – ఏపీ ప్రభుత్వ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, దివ్యాంగులైన రేషన్ కార్డుదారులకు ఈ నెల జులై రేషన్‌ను నాలుగు రోజుల ముందుగానే ఇళ్ల వద్దకు డోర్ డెలివరీ చేయాలని ఆదేశించింది. ఈ చర్యను నేటి (గురువారం) నుంచే అమలు చేస్తున్నారు.
జూన్ నుంచే ఈ డోర్ డెలివరీ విధానం ప్రకటించినప్పటికీ, సమాచారం లేకపోవడంతో చాలా మంది వృద్ధులు, దివ్యాంగులు ఈ నెల ప్రారంభంలో రేషన్ షాపులకు వెళ్లాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం ఈసారి ముందుగానే డోర్ డెలివరీ చేసేలా అధికారులకు, డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది.
డోర్ డెలివరీ పర్యవేక్షణ బాధ్యతను గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించారు. సాధారణ కార్డుదారులకు జులై 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ జరుగుతుండగా, వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం నేటి నుంచే ఇంటికే రేషన్ పంపిణీ జరుగుతుంది. రేషన్ షాపులకు ఇప్పటికే సరుకులు సరఫరా అయినట్లు అధికారులు తెలిపారు.