ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ హీరో జాకీ చాన్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆసియా నుంచి హాలీవుడ్ వరకూ ఆయన నటించిన యాక్షన్ చిత్రాలు విశేషంగా ఆడాయి. నటుడిగా మాత్రమే కాకుండా, యాక్షన్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నిర్మాత, స్క్రీన్ రైటర్, సింగర్, స్టంట్ పర్ఫార్మర్‌గా కూడా ఆయన తన ప్రతిభను నిరూపించుకున్నారు.
ఇప్పుడు ఆయన మరో గౌరవం అందుకోనున్నారు. ఆగస్టు 6 నుంచి 16 వరకు జరుగనున్న 78వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా, ఆగస్టు 9న జాకీ చాన్‌కు "లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు" అందజేయనున్నారు.
ఈ సందర్భంగా ఫెస్టివల్ ఆర్టిస్టిక్ డైరెక్టర్ జియోనె నజ్జారో మాట్లాడుతూ, “జాకీ చాన్ అనేక పాత్రల్లో రాణించిన బహుముఖ ప్రతిభావంతుడు. ఆయనను సత్కరించడం లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఒక గౌరవంగా భావిస్తున్నాం,” అని అన్నారు.
గతేడాది ఇదే పురస్కారం బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్‌కు అందింది. ప్రస్తుతం 71 ఏళ్ల వయస్సులో ఉన్న జాకీ చాన్, యథాశక్తి సినిమాల్లో నటిస్తూ తన ప్రత్యేక శైలిని కొనసాగిస్తున్నారు.