ప్రపంచ వైమానిక దళాల్లో భారత వాయుసేన (IAF) సత్తా చాటింది. ఆసియాలో అగ్రగామిగా ఉన్న చైనాను వెనక్కి నెట్టి, ఇప్పుడు భారత్ ప్రపంచంలో మూడో అత్యంత శక్తివంతమైన వైమానిక శక్తిగా గుర్తించబడింది. ‘వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్’ (WDMME) తాజా నివేదిక ప్రకారం, ఈ ర్యాంకింగ్ స్పష్టమైంది.
ప్రపంచవ్యాప్తంగా 103 దేశాల 120 రకాల వాయుసేనలను విశ్లేషించిన ఈ నివేదికలో, అమెరికా 242.9 TRV స్కోర్‌తో మొదటి స్థానంలో ఉంది. రష్యా 114.2 TRV స్కోర్‌తో రెండో స్థానంలో, భారత్ 69.4 TRV పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. చైనా 63.8 పాయింట్లతో నాలుగో స్థానానికి వెనుకపడింది.
ఇవే కాక, జపాన్ (58.1), ఇజ్రాయెల్ (56.3), ఫ్రాన్స్ (55.3) ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్ వైమానిక దళం 46.3 రేటింగ్‌తో 18వ స్థానానికి పరిమితమైంది. ఈ ర్యాంకులు భారత వైమానిక దళం ఆధునికీకరణ మరియు పెరుగుతున్న సామర్థ్యాలను ప్రతిబింబిస్తున్నాయి.