చండీగఢ్, సెప్టెంబర్ 26: భారత వాయుసేనలో ఆరు దశాబ్దాలపాటు సేవలందించిన రష్యన్ తయారీ మిగ్-21 యుద్ధవిమానానికి చండీగఢ్‌లో భావోద్వేగభరితమైన వీడ్కోలు లభించింది. 1963లోనే మొదటి మిగ్-21 స్క్వాడ్రన్ ఇక్కడే స్థాపించబడింది. ఈ సందర్భంగా శుక్రవారం ఆకాశం గర్జిస్తూ "ఫైనల్ సెల్యూట్" ఇచ్చింది.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్‌తో పాటు అగ్రశ్రేణి సైనికాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘బాదల్’, ‘పాంథర్’ పేర్లతో రెండు ఫ్లైపాస్ట్ ఫార్మేషన్లు ఆకట్టుకున్నాయి. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్వయంగా చివరి సోర్టీని ‘బాదల్ 3’ కాల్‌సైన్‌తో నడిపారు. స్క్వాడ్రన్ లీడర్ ప్రియా శర్మ కూడా ఈ చారిత్రక క్షణంలో ప్రధాన పాత్ర పోషించారు.
1965, 1971 యుద్ధాలు, 1999 కార్గిల్ పోరు, 2019 బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్‌లో మిగ్-21 కీలకపాత్ర పోషించింది. ముఖ్యంగా బాలాకోట్‌లో పాకిస్థాన్ ఎఫ్-16ను కూల్చివేసి చరిత్ర సృష్టించింది.
ఇకపై మిగ్-21 స్థానంలో స్వదేశీ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్సీఏ) తేజస్ రానుంది. దీంతో భారత వాయుసేనలో కొత్త యుగానికి నాంది పలికినట్టే.