కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆరోగ్య బీమాపై జీఎస్టీని తొలగించడంతో ప్రజల్లో హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది. ప్రముఖ ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ సంస్థ పాలసీ బజార్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే వారి సంఖ్య 38 శాతం మేర పెరిగింది. జీఎస్టీ ఎత్తివేత సామాన్యులకు ఊరటనివ్వడమే కాకుండా, బీమా ప్రాముఖ్యతను కూడా పెంచిందని నివేదిక స్పష్టం చేస్తోంది.
నివేదిక ప్రకారం, బీమా తీసుకునే వారి సంఖ్య పెరగడంతో పాటు, వారు ఎంచుకునే కవరేజీ మొత్తం కూడా రూ.13 లక్షల నుంచి రూ.18 లక్షలకు పెరిగింది. కొత్త పాలసీలలో 45 శాతం మంది రూ.15–25 లక్షల మధ్య, 24 శాతం మంది రూ.10–15 లక్షల మధ్య, 18 శాతం మంది రూ.10 లక్షల లోపు కవరేజీ ఉన్న పాలసీలను ఎంచుకుంటున్నారు.
ఇప్పటికే బీమా ఉన్నవారు కూడా జీఎస్టీ మినహాయింపును సద్వినియోగం చేసుకుంటూ తమ పాలసీల కవరేజీని పెంచుకుంటున్నారు. ముఖ్యంగా 61 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో అధిక కవరేజీ ఉన్న పాలసీలపై ఆసక్తి 11.5 శాతం మేర పెరిగింది.
నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పై అవగాహన, ఆసక్తి పెరుగుతుండటం గమనార్హం. మొత్తం మీద దేశవ్యాప్తంగా హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్ పెరగడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ మినహాయింపు నిర్ణయమే కీలక కారణం అని నివేదిక తేల్చింది.