అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు, హెచ్-1బీ వీసా విధానంలో పెద్ద మార్పులు రానున్నాయి. వైట్ హౌస్ ప్రస్తుతం అమలులో ఉన్న లాటరీ పద్ధతిని రద్దు చేసి, దాని స్థానంలో జీతం ఆధారంగా వీసాలను కేటాయించే విధానానికి ఆమోదం తెలిపింది. దీని ప్రకారం, అధిక జీతం ఇచ్చే ఉద్యోగాలకు వీసా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ప్రస్తుతం అమెరికా ప్రతి సంవత్సరం 85,000 హెచ్-1బీ వీసాలను జారీ చేస్తోంది. ఇప్పటివరకు, దరఖాస్తులు ఎక్కువగా రావడంతో కంప్యూటర్ లాటరీ ద్వారా ఎంపిక చేస్తున్నారు. కొత్త ప్రతిపాదన ప్రకారం, ఇకపై లాటరీ ఉండదు. బదులుగా, అత్యధిక జీతం ఆఫర్ చేసే ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఈ విధానం ట్రంప్ ప్రభుత్వ కాలంలో ప్రతిపాదించబడినదే. ఆగస్టు 8న ‘ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్’ ఈ ప్రతిపాదనను క్లియర్ చేసింది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఈ మార్పులు అమలైతే, అమెరికా టెక్ కంపెనీలు అధిక నైపుణ్యం, అధిక జీతాలు కలిగిన ఉద్యోగులను మాత్రమే నియమించుకుంటాయి. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ఎక్కువగా అమెరికన్లకే దక్కుతాయి. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువు పూర్తిచేసుకున్న విదేశీ విద్యార్థులు, తక్కువ జీతంతో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి హెచ్-1బీ వీసా దాదాపు అందకపోవచ్చు. వీసాల సంఖ్య మారనంత వరకు, కాంగ్రెస్ అనుమతి అవసరం లేకుండా డీహెచ్‌ఎస్, యూఎస్‌సీఐఎస్ ఈ మార్పులను అమలు చేయగలవు. వలస హక్కుల సంఘాలు, వ్యాపార వర్గాలు ఇప్పటికే దీనికి వ్యతిరేకంగా ఉన్నాయని తెలుస్తోంది.