ప్రసిద్ధ ఐటీ కంపెనీలకు భూమి కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విశాఖపట్నం మధురవాడలోని 22 ఎకరాలను ఎకరాకు 99 పైసల చొప్పున కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌కు కేటాయించిన ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్లపై ముఖ్య న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించగా, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి నూతన పారిశ్రామిక విధానం ప్రకారం భూములు కేటాయిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కూడా చెప్పారు.
పెట్టుబడులను ఆకర్షించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రోత్సాహకాలు లేకపోతే కంపెనీలు బెంగళూరు లేదా హైదరాబాద్‌లను ఎంచుకుంటాయని హెచ్చరించింది. ఐటీ కంపెనీల ద్వారా యువతకు ఉద్యోగాలు, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, భూకేటాయింపుల వల్ల కలిగే భవిష్యత్తు ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ప్రభుత్వం అనుసరిస్తున్న భూకేటాయింపు విధానాన్ని కోర్టులో సమర్పించాలని ఆదేశించింది.