AP మెగా DSC 2025: దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులకు ఇబ్బందులు
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను కూటమి ప్రభుత్వం గత నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి అభ్యర్థులు అనేక సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సర్టిఫికెట్ల అప్‌లోడ్‌లో సమస్యలు రావడంతో అభ్యర్థులు అసంతృప్తికి గురయ్యారు. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్, సర్టిఫికెట్ల అప్‌లోడ్ కేవలం ఐచ్ఛికమని ప్రకటించడంతో కొంత ఊరట లభించింది.
దరఖాస్తు లోపాలపై అభ్యర్థుల ఆందోళనలు
అభ్యర్థులు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య దరఖాస్తులో చేయబడిన తప్పులు సరిచేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ లేకపోవడమే. ముఖ్యంగా పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ తప్పుగా నమోదైన వారు తాము మార్పులు చేసుకోలేక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ పేరు, చిరునామా వంటి వివరాల మార్పుకు అవకాశం ఇచ్చినప్పటికీ, జన్మతేదీ మరియు ఆధార్ నంబర్ మార్పు అవకాశం మాత్రం కల్పించలేదు. ఈ పరిస్థితి వలన అభ్యర్థులు నిరాశలో మునిగిపోతున్నారు.
అర్హత నిబంధనలపై అభ్యర్థుల విజ్ఞప్తులు
భౌతిక శాస్త్రం టీచర్ పోస్టుల విషయంలో B.Sc Computers చదివిన అభ్యర్థులకు కూడా అర్హత ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసి వయో పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని మరియు B.Sc Computers అభ్యర్థులకు అర్హత కల్పించాలని కోరారు. నోటిఫికేషన్ ప్రకారం, ఇంటర్మీడియట్‌లో MPC చదివి, B.Ed లో సంబంధిత మెథడాలజీ చదివినవారే అర్హులు. అయితే B.Sc Computersలో ఫిజిక్స్ ఉండగా కెమిస్ట్రీ ఉండదు. అదే సమయంలో BCA అభ్యర్థులకు అవకాశం ఇవ్వడాన్ని అభ్యర్థులు అసమంజసంగా అభిప్రాయపడుతున్నారు. ఫిజిక్స్ సబ్జెక్టుకు కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు కూడా అవకాశం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.