అఖిల భారత సర్వీసుల నియామకాలకు నిర్వహించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2025 మే 25న దేశ వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇటీవల అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.
హైదరాబాద్, మే 16: యూపీఎస్సీ ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2025 మే 25న దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో నిర్వహించనుంది. ఈ ఏడాది 979 సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది. జనవరి 22 నుండి దరఖాస్తులు స్వీకరించింది. పరీక్ష తేదీ దగ్గరపడటంతో యూపీఎస్సీ తాజాగా అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వడం ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
యూపీఎస్సీ తెలిపింది అడ్మిట్ కార్డులు మే 25 వరకు వెబ్‌సైట్‌లో ఉండనున్నాయని. అభ్యర్థులు తుది ఫలితాలు వెలువడే వరకు అడ్మిట్ కార్డును సురక్షితంగా ఉంచుకోవాలని సూచించింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడి, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలతో ఉంటాయి. రెండో పేపర్‌లో కనీస అర్హత మార్కులు సాధించిన వారికి మొదటి పేపర్ మూల్యాంకనం జరుగుతుంది. తర్వాత మెయిన్స్, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
ఏపీ ఈసెట్ 2025 ఫలితాలు:
ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2025 ఫలితాలు మే 15న అనంతపురం జేఎన్‌టీయూ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 34,224 మంది పరీక్ష ఇవ్వగా, 31,922 మంది అంటే 93.26 శాతం మంది అర్హత సాధించినట్లు ఏపీ ఈసెట్ కన్వీనర్ బి. దుర్గాప్రసాద్ తెలిపారు.