దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం SSMB29 గురించి తాజా అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోందని తెలిపారు. నవంబర్ 15న ‘గ్లోబ్ ట్రాటర్’ పేరుతో భారీ ఈవెంట్‌కి సిద్ధమవుతున్నట్లు కూడా వెల్లడించారు.
రాజమౌళి తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ — “ముగ్గురు ప్రధాన నటులతో క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. అదే సమయంలో ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ కోసం కూడా భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. మేము ఇంతకుముందు చేసిన దానికంటే భిన్నంగా, కొత్తగా ఉండబోతోంది. నవంబర్ 15న మీ అందరికీ గొప్ప అనుభూతి ఇస్తుంది,” అని పేర్కొన్నారు.
ఈ ఈవెంట్‌కు ముందు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదలవుతుందని కూడా రాజమౌళి తెలిపారు.
ఇదిలా ఉంటే, కొన్ని రోజుల క్రితం మహేశ్ బాబు – రాజమౌళి మధ్య సోషల్ మీడియాలో జరిగిన సరదా సంభాషణ వైరల్ అయ్యింది. నవంబర్ 1న మహేశ్ “నవంబర్ వచ్చేసింది రాజమౌళి గారు” అని ట్వీట్ చేయగా, రాజమౌళి “ఈ నెల ఏ సినిమాకి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నావు?” అని జవాబు ఇచ్చారు. దానికి మహేశ్ “మీ మహాభారతం గురించే సార్! నవంబర్‌లో ఏదో ఇస్తానని మాటిచ్చారు, నిలబెట్టుకోండి” అని రిప్లై ఇచ్చారు.
ఈ సరదా చాట్‌లో ప్రియాంక చోప్రా కూడా పాల్గొంది. “హలో హీరో! సెట్‌లో నాతో పంచుకునే కథలన్నీ లీక్ చేయమంటావా?” అంటూ ఆమె హాస్యంగా బదులిచ్చింది. దీనిపై రాజమౌళి “సర్‌ప్రైజ్ పాడుచేశావ్ మహేశ్!” అని సరదాగా కామెంట్ చేశారు.
ఈ సంభాషణలు, రాజమౌళి తాజా అప్‌డేట్‌లతో SSMB29పై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి.