అనకాపల్లి జిల్లాలోని సరియా జలపాతం వద్ద 36 మంది పర్యాటకులు చిక్కుకుపోయిన ఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి వచ్చిన ఈ బృందం నిన్న జలపాతం సందర్శించడానికి వెళ్లగా, భారీ వర్షం కారణంగా సరియా నదికి వరద వచ్చి వారు నదికి ఆవల చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహాన్ సిన్హా రెవెన్యూ అధికారులు, పోలీసులు, మరియు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎస్పీతో పాటు దేవరాపల్లి ఎస్ఐ సత్యనారాయణ, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు.
సహాయక బృందాలు పర్యాటకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. దేవరాపల్లి వద్ద అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, కె. కోటపాడు సీఐ పైడపునాయుడు పర్యాటకుల కోసం పునరావాస సదుపాయాలు కల్పించారు. వేగంగా స్పందించిన అధికారులు పెద్ద ప్రమాదాన్ని తప్పించారు.