రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి బలమైన ప్రోత్సాహం: మంత్రి నారా లోకేష్
అమరావతి, జూన్ 27: రాయలసీమ ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో కర్నూల్ జిల్లా ఒరవకల్లో రూ.1,622 కోట్ల పెట్టుబడితో రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (RCPL) బీవరేజెస్ యూనిట్ ఏర్పాటు కోసం భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ యూనిట్‌లో సోడా, జ్యూస్, బాటిల్డ్ వాటర్ ఉత్పత్తి చేయనున్నారు. ఇందులో స్థానికులకు 1,200 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి.
ఈ మేరకు పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ అధికారికంగా భూమి కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణం 2026 జూన్ నాటికి పూర్తవుతుంది. వాణిజ్య ఉత్పత్తి డిసెంబరు 31, 2026న ప్రారంభమవుతుంది. ఇది మెగా ప్రాజెక్టుగా గుర్తించబడినందున, రిలయన్స్ కొన్ని ప్రత్యేక రాయితీలను కోరింది. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (SIPB) ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
జూన్ 19న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన SIPB సమావేశంలో మొత్తం ₹28,546 కోట్ల విలువైన 19 పెట్టుబడి ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటితో సుమారు 30,270 మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయి. అలాగే అనంతపురం జిల్లా తిమ్మసముద్రంలో జి. ఇన్‌ఫ్రా ప్రెసిషన్స్ లిమిటెడ్ కంపెనీ ₹1,150 కోట్లతో బయో మాడ్యులర్ చార్జ్ సిస్టమ్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. కంపెనీకి ఎకరా రూ.8.30 లక్షల చొప్పున 121.53 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూమి స్వాధీనం అయిన 14 నెలల్లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. 299 మందికి ఉద్యోగాలు కలుగుతాయి.