యూపీలో 300 ఏళ్ల పాత పంచముఖి శివలింగం వెలుగులోకి
ఉత్తరప్రదేశ్‌లోని బదాయూం జిల్లా, దాతాగంజ్ తహసీల్ పరిధిలోని సరాయ్ పిపరియా గ్రామంలో మంగళవారం కొలను తవ్వకాల్లో పంచముఖి శివలింగం బయటపడింది. ఇది దాదాపు 300 ఏళ్ల పాతదై ఉండొచ్చని స్థానిక బ్రహ్మదేవ్ ఆలయ పూజారి మహంత్ పరమాత్మా దాస్ మహరాజ్ తెలిపారు.
ఈ విషయం పరిసర గ్రామాలవారికి తెలియగానే శివలింగాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. భక్తులు శివలింగాన్ని పూజిస్తూ దీపాలు వెలిగించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.
ఈ తవ్వకాలు పర్యావరణవేత్త మరియు నర్మదా బచావో ఉద్యమ కార్యకర్త శిప్రా పాఠక్ స్వంతంగా ఉన్న 13 ఎకరాల భూమిలో చేపట్టారు. అక్కడే ఆమె పంచతత్వ పౌధ్‌శాల పేరిట నర్సరీను కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం 5 లక్షల మొక్కలు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో ఆమె ఫౌండేషన్ పని చేస్తోందని చెప్పారు. శివలింగం వెలుగులోకి రావడం భగవంతుని అనుగ్రహంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ శివలింగాన్ని పరిశీలించేందుకు పురావస్తు శాఖ అధికారులను పిలవనున్నట్టు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ధర్మేంద్ర కుమార్ సింగ్ వెల్లడించారు.