పాన్ కార్డు సేవలను మరింత సులభతరం చేసేందుకు ఆదాయ పన్ను శాఖ పాన్ 2.0 అనే కొత్త డిజిటల్ ప్రాజెక్టును ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకు పాన్ సేవల కోసం ప్రజలు ఈ-ఫైలింగ్, యూటీఐఐటీఎస్ఎల్, ప్రోటీన్ వంటి వేర్వేరు పోర్టళ్లను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇకపై అన్ని సేవలు ఒకే వేదికలో లభించనున్నాయి.
ఈ ప్రాజెక్టు బాధ్యతను ప్రముఖ ఐటీ సంస్థ ఎల్టీఐమైండ్‌ట్రీకి అప్పగించారు. ఈ సంస్థ డిజైన్, అభివృద్ధి, అమలు మరియు నిర్వహణ బాధ్యతలను చేపడుతుంది. 18 నెలల్లో ఈ కొత్త పోర్టల్ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ రూ.1,435 కోట్లు మంజూరు చేసింది.
ఈ కొత్త విధానంలో కొత్త పాన్ కార్డు పొందడం, మార్పులు చేయడం, ఆధార్ లింకింగ్, రీప్రింట్, వెరిఫికేషన్ వంటి సేవలు పేపర్‌లెస్ & ఉచితంగా అందుబాటులో ఉంటాయి. దరఖాస్తుదారులకు ఈ-పాన్ నేరుగా వారి ఈమెయిల్‌కి పంపిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 81 కోట్ల పాన్ కార్డులు మరియు 73 లక్షల టాన్ నంబర్లు చలామణీలో ఉన్నాయని అధికారులు తెలిపారు. పాత పాన్ కార్డులు యధావిధిగా చెల్లుబాటవుతాయని స్పష్టం చేశారు.