పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అతవుల్లా తరార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తమపై సైనిక చర్య చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. “వచ్చే 24 నుంచి 36 గంటల్లో భారత్ సైనిక దాడికి సిద్ధమవుతోంది. నిఘా వర్గాల నుంచి ఈ మేరకు ఖచ్చితమైన సమాచారం అందింది,” అని తెలిపారు.
ఇక ప్రధాని మోదీ ఇటీవల త్రివిధ దళాల అధిపతులతో అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడ్డట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య పాక్ మంత్రికి వచ్చిన అనుమానాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అతవుల్లా తరార్ పహల్గామ్ దాడిపై స్పందిస్తూ, “తాము కూడా ఉగ్రవాద బాధితులమే. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక దర్యాప్తుకు సిద్ధమున్నాం,” అని అన్నారు. అయినప్పటికీ భారత్ వైఖరి దాడికి దారితీసేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ ఎలాంటి సైనిక చర్య చేపట్టినా, పాక్ నుంచి తగిన ప్రతిచర్య ఎదురవుతుందని హెచ్చరించారు.