మలేషియాలో పోలీస్ హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సీనియర్ అధికారులతో సహా ఐదుగురికి గాయాలు
మలేషియాలో జోహోర్ రాష్ట్రంలోని పులాయ్ నదిలో ఒక పోలీస్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులతో సహా ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదం మాక్ డ్రిల్ (తదుపరి పరిస్థితులకు శిక్షణ కసరత్తు) సమయంలో జరిగిందని మలేషియా పౌర విమానయాన శాఖ తెలిపింది. మిత్సతోమ్ 2025 పేరుతో మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలు కలిసి బహుళ అణు భద్రతా కసరత్తు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల బృందాలు పాల్గొన్నాయి.
ఈ క్రమంలో తంజుంగ్ కుపాంగ్ పోలీస్ స్టేషన్ నుంచి ఎయిర్ బస్ (AS 355 N హెలికాప్టర్) బయలుదేరింది. ఇది గెలాంగ్ పటాలోని మలేషియా మారిటైమ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ (MMEA) జెట్టీ సమీపానికి వచ్చిన తర్వాత నియంత్రణ కోల్పోయి నదిలో కూలింది.
ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకొని పైలట్‌తో సహా ఐదుగురిని రక్షించాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా పాకుతున్నాయి.