తొలిరోజు బాలాత్రిపురసుందరిగా దర్శనమివ్వనున్న కనకదుర్గమ్మ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందడి ప్రారంభం. ఈ రోజు నుంచి 11 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తొలి రోజున కనకదుర్గమ్మ శ్రీ బాలాత్రిపురసుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 8 నుంచి 8:30 గంటల మధ్య భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
భక్తుల సౌకర్యార్థం కొత్త ఏర్పాట్లు
భద్రతను పెంచేందుకు ఈ సంవత్సరం కొత్త ‘ఫ్రేమ్ మోడల్’ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులు బయటకు రావడానికి ప్రతి 50 మీటర్లకు ఎమర్జెన్సీ గేట్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బోర్డులు, ఎరుపు రంగుతో గుర్తింపు సులభం. రూ. 500 ప్రత్యేక దర్శనం టికెట్‌ను రద్దు చేసి, రూ. 300, రూ. 100, ఉచిత క్యూలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
సాంకేతిక పర్యవేక్షణ, మెరుగైన సేవలు
హెడ్-కౌంట్ కెమెరాలు, 500 సీసీ కెమెరాలు, మోడల్ గెస్ట్‌హౌస్‌లో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ కేంద్రాలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు భక్తుల కోసం ఏర్పాటు. 12 లడ్డూ ప్రసాద కౌంటర్లు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్లు కేటాయించారు.
భారీ భద్రత, కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్
రథం సెంటర్ వద్ద కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించడం వల్ల భక్తుల ప్రయాణం సులభం. ఉత్సవ బందోబస్తుకు 6,000 మంది పోలీసులు, 500 దేవదాయ సిబ్బంది, 1,400 పారిశుద్ధ్య కార్మికులు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.