అమెరికా డాలర్‌తో పోలిస్తే బుధవారం భారత రూపాయి భారీ లాభాలను నమోదు చేసింది. రెండు వారాల తర్వాత తొలిసారి రూపాయి 88 మార్క్ కంటే దిగువన ట్రేడింగ్ జరగడం గమనార్హం. భారత్–అమెరికా వాణిజ్య చర్చలు పునఃప్రారంభం కానుండటం, అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటం రూపాయి బలపడటానికి కారణమయ్యాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి 23 పైసలు లాభపడి 87.82 వద్ద కొనసాగింది.
మంగళవారం ట్రేడింగ్‌లో రూపాయి 7 పైసలు బలపడి 88.09 వద్ద ముగిసింది. అయితే ఈరోజు మరింత బలమైన ప్రదర్శన కనబరిచింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా వెళ్తోందన్న భయాలతో డాలర్ ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడికి గురైంది. మూడీస్ చీఫ్ ఎకనామిస్ట్ మార్క్ జాండీ కూడా అమెరికా ఉద్యోగాలు, ఉత్పాదకత, వ్యయాలపై ఆధారపడి మాంద్యం ముంగిట ఉందని పేర్కొన్నారు.
అయినా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకోబోయే నిర్ణయం కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ప్రవాహంపై పెద్ద ప్రభావం చూపనుంది.
విశ్లేషకుల ప్రకారం, రూపాయికి 88.20 వద్ద నిరోధం ఉండవచ్చు. ఒకవేళ 87.90 స్థాయిని దాటి మరింత బలపడితే, 87.50 లేదా 87.20 స్థాయులకు చేరే అవకాశముంది. మరోవైపు, డాలర్ ఇండెక్స్ 0.11 శాతం పెరిగి 96.73 వద్ద ఉండగా, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.20 శాతం తగ్గి బ్యారెల్‌కు 68.33 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.