హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు భారీగా కుప్పకూలినవే
కొంతకాలంగా రికార్డు స్థాయిలో ఉన్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. శనివారం బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు భారీగా పడిపోవడంతో పండుగ సీజన్‌లో కొనుగోళ్లు చేయాలనుకుంటున్న వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది. ముఖ్యంగా ఇటీవల ఆకాశమే హద్దుగా పెరిగిన వెండి ధర ఒక్కరోజులోనే కిలోకు రూ.13,000 తగ్గడం విశేషం.
హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు:
హైదరాబాద్ మార్కెట్లో శనివారం నాటి ధరలను పరిశీలిస్తే, కిలో వెండి ధర రూ.13,000 తగ్గి రూ.1,90,000 వద్ద నిలిచింది. శుక్రవారం ఈ ధర రూ.2,03,000గా ఉంది. బంగారం ధరలు కూడా అదే బాటలో నడిచాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,910 తగ్గి రూ.1,30,860కి చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం తులం ధర రూ.1,750 తగ్గి రూ.1,19,950కు పడిపోయింది.
ధరల పతనానికి కారణాలేమిటి?
ఈ ఆకస్మిక ధరల పతనానికి అంతర్జాతీయ పరిణామాలు మరియు మదుపరుల లాభాల స్వీకరణ ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై విధించిన దిగుమతి సుంకాలు తాత్కాలికమేనని, త్వరలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని ప్రకటించారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి తొలగి, బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడులపై డిమాండ్ తగ్గిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరగడంతో సరఫరా పెరిగి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ప్రపంచ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర $100 కంటే ఎక్కువగా పడిపోయింది. వెండి కూడా దాదాపు $3 వరకు పతనమైంది. రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.