ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఓపెన్ఏఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తన పాపులర్ చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీ ద్వారా అడల్ట్ కంటెంట్ (శృంగారపరమైన) రూపొందించుకునేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన యూజర్లు మాత్రమే ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.
ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, "పెద్దలను పెద్దలుగానే పరిగణించాలన్నది మా సిద్ధాంతం" అని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నుండి కొత్త విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. యూజర్లు ఇచ్చే ప్రాంప్ట్‌ల ఆధారంగా చాట్‌జీపీటీ కథలు, యానిమేషన్ చిత్రాలు, వీడియోల రూపంలో ఎరోటిక్ కంటెంట్‌ను సృష్టించగలదని ఆయన వివరించారు. అయితే, ఈ కంటెంట్ మొత్తం ఏఐ సృష్టించినదే, ఎక్కడా నిజమైన మనుషులు ఉండరని కంపెనీ స్పష్టం చేసింది.
ఇప్పటివరకు ఓపెన్ఏఐ ఈ తరహా కంటెంట్‌కి దూరంగా ఉండేది. అయితే ఎలాన్ మస్క్‌కు చెందిన ‘గ్రోక్’ చాట్‌బాట్ ఇప్పటికే ఇలాంటి సేవలు అందిస్తున్న నేపథ్యంలో పోటీలో వెనుకబడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెక్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘గ్రోక్ ఇమాజిన్’ అనే టూల్ ద్వారా యూజర్లు 3డీ యానిమేటెడ్ కంపానియన్స్‌తో సంభాషణలు జరపడం, చిన్న వీడియోలు రూపొందించడం వంటి ఫీచర్లు ఉండటంతో, ఓపెన్ఏఐ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది.