అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ – 50 ఎకరాల్లో ప్రాజెక్టుకు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఐటీ రంగంలో మరో మైలురాయిని చేరుకోబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం భాగస్వామ్యంతో ప్రభుత్వం “అమరావతి క్వాంటమ్ వ్యాలీ” స్థాపనకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ప్రాజెక్ట్ కింద 50 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ (AQCC) ఏర్పాటుకానుంది. ఇందులో భాగంగా ఐబీఎం కీలక పాత్ర పోషించనుంది. సంస్థ ఉచితంగా 133 బిట్ సామర్థ్యమున్న సిస్టమ్ తో పాటు 5కే గేట్ క్వాంటమ్ కంప్యూటర్ ను ఏర్పాటు చేయనుంది.
ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు, చదరపు అడుగుకు రూ.30 చొప్పున చెల్లించడంతో పాటు, రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు నాలుగేళ్లపాటు ఉచిత ఇంటర్నెట్ సేవలు (ఏటా 365 గంటలు) అందించేందుకు ఐబీఎం అంగీకరించింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాజెక్ట్ అమలులోకి వస్తే రాజధానిలో అత్యాధునిక సాంకేతికత, ఐటీ రంగ అభివృద్ధి కి కొత్త దిశ లభించనుంది.