కేంద్ర ప్రభుత్వం దేశంలో పాఠశాల విద్యారంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు సిద్ధమైంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు, సీబీఎస్ఈ పరిధిలోని పాఠశాలల్లో 3వ తరగతి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాఠాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ నూతన విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా సుమారు 31,000 పాఠశాలల్లో అమల్లోకి రానుంది.
ప్రారంభంలో విద్యార్థులకు ఏఐ ప్రాథమిక అంశాలు పరిచయం చేయబడతాయి. భాషా నైపుణ్యాలు మెరుగుపరచడం, గణిత సమస్యలు పరిష్కరించడం, చాట్‌బోట్ ప్రాంప్ట్‌లు, లాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీల అవగాహనను చిన్న వయసులోనే విద్యార్థులకు అందించనున్నారు. 3వ తరగతి నుంచి ప్రాథమిక అంశాలను పరిచయం చేసి, 6వ తరగతి నుంచి ఏఐని స్కిల్ సబ్జెక్ట్గా బోధించనున్నారు.
కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, "చిన్న వయసులోనే విద్యార్థులలో టెక్నాలజీ పట్ల అవగాహన పెంపొందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం" అని తెలిపారు. ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టు అమల్లో ఉంది, ఇందులో ఉపాధ్యాయులు ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తూ బోధిస్తున్నారని ఆయన వివరించారు.
అంతేకాక, దేశంలోని దాదాపు కోటి మంది ఉపాధ్యాయులకు ఏఐ టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల ఉపాధ్యాయులు నూతన సాంకేతికతను అందించగలిగి, విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించగలుగుతారు.