ట్రంప్ 50% సుంకం – భారత వస్త్ర పరిశ్రమలో పెను సంక్షోభం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 50% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం భారత వస్త్ర పరిశ్రమను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. వాల్‌మార్ట్, అమెజాన్, టార్గెట్, గ్యాప్ వంటి అమెరికా రిటైల్ దిగ్గజాలు భారత సరఫరాదారుల నుంచి ఆర్డర్లను తక్షణమే నిలిపివేశాయి. శుక్రవారం నాటికి ఈ విషయాన్ని అధికారికంగా ఎగుమతిదారులకు తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
అమెరికా కొనుగోలుదారులు లేఖలు, ఈ-మెయిళ్ల ద్వారా వస్త్రాల రవాణాను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిలిపివేయాలని కోరారని ఎగుమతిదారులు వెల్లడించారు. పెరిగిన సుంకాల భారాన్ని అమెరికన్ కంపెనీలు పంచుకోనని, పూర్తిగా భారత ఎగుమతిదారులే భరించాలని స్పష్టం చేశాయి. దీంతో ఎగుమతి ఖర్చులు 30–35% పెరగవచ్చని, ఈ భారాన్ని మోయడం అసాధ్యమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
ఈ పరిణామంతో అమెరికాకు వెళ్ళే భారత వస్త్ర ఆర్డర్లు 40–50% వరకు పడిపోవచ్చని, ఏటా 4–5 బిలియన్ డాలర్లు (₹35,000 కోట్లకు పైగా) నష్టం వాటిల్లే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెల్‌స్పన్ లివింగ్, గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్, ఇండో కౌంట్, ట్రైడెంట్ వంటి ప్రముఖ ఎగుమతి సంస్థలు ఎక్కువగా ప్రభావితమవనున్నాయి. అమెరికా మార్కెట్‌పై 40–70% వరకు ఆధారపడే ఈ సంస్థలకు ఇది పెద్ద దెబ్బగా మారనుంది. ఇదే సమయంలో బంగ్లాదేశ్, వియత్నాం వంటి పోటీ దేశాలకు ఇది వరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ దేశాలపై అమెరికా కేవలం 20% సుంకమే విధిస్తోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (CITI) దీన్ని భారత పరిశ్రమకు పెద్ద ఎదురుదెబ్బగా పేర్కొంది. 2024–25లో భారత్ 36.61 బిలియన్ డాలర్ల విలువైన వస్త్ర, టెక్స్‌టైల్ ఎగుమతుల్లో అమెరికా వాటా 28%గా ఉంది. ఈ పరిణామాలతో భారత ఎగుమతిదారులు తీవ్రమైన అనిశ్చితిలో పడ్డారు.