విజయవాడ దసరా 2025: ఇంద్రకీలాద్రిపై భారీ సంబరాలు.. రూ.4 కోట్ల ఏర్పాట్లు

ఈ నెల 22వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం కనకదుర్గమ్మ దేవస్థాన అధికారులు సుమారు రూ.4 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఖరారు చేసి, కాంట్రాక్టర్లకు అప్పగించారు. కొండ దిగువన రూ.2.54 కోట్లతో, కొండపైన రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ప్రతి ఏడాది కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ, చాలా నిర్మాణాలు తాత్కాలికంగానే ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

తాత్కాలిక క్యూ లైన్లు, వాటర్ ప్రూఫ్ షామియానాలు, స్నానఘట్టాల వద్ద షెడ్లు, విద్యుత్ దీపాల అలంకరణ, మైక్ సెట్ల ఏర్పాటు వంటి పనులకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. వినాయకుడి గుడి నుంచి ఘాట్ రోడ్డు వరకు షామియానాల కోసం రూ.27.30 లక్షలు, హంస వాహనం మరమ్మతులకు రూ.7.30 లక్షలు, బాణాసంచా కోసం రూ.5.86 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కొండపైన క్యూ లైన్లు, లైటింగ్, వీఐపీ వాహనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

సాధారణంగా టెండర్లు అంచనా వ్యయం కన్నా తక్కువ మొత్తానికి దక్కుతుంటే, ఈసారి సీసీటీవీ టెండర్ మాత్రం రూ.7.80 లక్షల అంచనా వ్యయంపై 1.40% అధిక ధరతో రూ.7.91 లక్షలకు ఖరారైంది. శాశ్వత నిర్మాణాలపై దృష్టి పెట్టకపోవడంతో ప్రతీ ఏడాది తాత్కాలిక పనులకే భారీ నిధులు వృథా అవుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అలాగే భక్తుల సౌకర్యార్థం మంచినీటి సరఫరా, తాత్కాలిక టాయిలెట్లు, లగేజీ కౌంటర్ల నిర్వహణ బాధ్యతలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ)కి అప్పగించారు. ముందుగా వీఎంసీ ఈ ఖర్చులు భరించి, ఆ తరువాత దేవస్థానానికి బిల్లులు సమర్పిస్తుంది. గత ఏడాది కేవలం నీటి బాటిళ్లు, ప్యాకెట్ల సరఫరాకు మాత్రమే రూ.2 కోట్లు చెల్లించగా, ఈ ఏడాది కూడా ఇదే విధానం కొనసాగనుంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book