ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రమశిక్షణ, భద్రత కోసం కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ విజయ్ రామరాజు తాజా ఉత్తర్వులు జారీ చేశారు. వాటి ప్రకారం ఇకపై పాఠశాలలకి పని వేళల్లో ఇతర వ్యక్తులకు ఎంట్రీ ఉండదని ప్రకటించారు. పాఠశాలలలోని శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై టీచర్లు, సిబ్బంది, విద్యార్థులు మాత్రమే పాఠశాలకు అనుమతి లేకుండా ప్రవేశించగలరు. ఇతరులెవరైనా (ప్రైవేటు వ్యక్తులు, అనుమతి లేని వారు) పాఠశాలలోకి రావాలంటే తప్పనిసరిగా ప్రధానోపాధ్యాయుల నుండి ముందుగా అనుమతి తీసుకోవాలి. ఈ చర్య విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నదిగా అధికారులు తెలిపారు.
ఈ నిబంధనలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వెంటనే అమలులోకి వస్తాయని విజయ్ రామరాజు స్పష్టం చేశారు. పాఠశాలల్లో క్రమశిక్షణ, మంచి విద్యా వాతావరణం కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ మార్గదర్శకాలు తీసుకొచ్చినట్టు ఆయన తెలిపారు.