ఉత్తరాఖండ్ వరదలు: రుద్రప్రయాగ్, చమోలీలో కుంభవృష్టి బీభత్సం
అకస్మికంగా కురిసిన భారీ వర్షాలు, కుంభవృష్టి ప్రభావంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. రుద్రప్రయాగ్, చమోలీ జిల్లాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పలు కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకోగా, అనేక ఇళ్లు, వంతెనలు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి.
చమోలీ జిల్లాలోని మోపటా గ్రామంలో తారా సింగ్, ఆయన భార్య గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. ఇదే ఘటనలో విక్రమ్ సింగ్ దంపతులు గాయపడ్డారు. వారి పశువుల పాక కూలిపోవడంతో సుమారు 15 నుంచి 20 పశువులు మృత్యువాత పడ్డాయి.
రుద్రప్రయాగ్ జిల్లాలో అలకనంద, మందాకిని నదులు సంగమ స్థలంలో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కేదార్‌నాథ్ లోయలోని లవారా గ్రామంలో వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. రుద్రప్రయాగ్‌లోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయం పూర్తిగా నీటమునిగింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేసి, రక్షణ చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని తెలిపారు. రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ ప్రతీక్ జైన్ ప్రకారం, బసుకేదార్ తహసీల్‌లో నాలుగు ఇళ్లు కొట్టుకుపోయినా, నివాసితులందరినీ సురక్షితంగా తరలించామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, భారీ వర్షాల కారణంగా హల్ద్వానీ–భీమ్‌తాల్ రహదారిపై రాణి బాగ్ వంతెన సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రుద్రప్రయాగ్, బాగేశ్వర్, చమోలీ, హరిద్వార్, పితోరాగఢ్ జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు శుక్రవారం సెలవు ప్రకటించారు.