ఇరాన్ క్షిపణి కార్యక్రమానికి సహకరిస్తోందన్న ఆరోపణలతో అమెరికా మరోసారి చర్యలకు దిగింది. చండీగఢ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మ్‌లేన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే భారత కంపెనీపై యూఎస్ ట్రెజరీ విభాగం ఆంక్షలు ప్రకటించింది. ఇరాన్ మిస్సైల్ మరియు డ్రోన్ ప్రోగ్రామ్‌లకు అవసరమైన సామగ్రి సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌లో ఈ సంస్థ భాగమని అమెరికా ఆరోపించింది. మొత్తం 32 సంస్థలు, వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించగా, ఫార్మ్‌లేన్ కూడా ఆ జాబితాలో ఉండటం విశేషం.
ట్రెజరీ విభాగం ప్రకారం, కంపెనీ నేరుగా క్షిపణుల కోసం ముడి పదార్థాలను సరఫరా చేయకపోయినా, కంపెనీ డైరెక్టర్ మార్కో క్లింగే కీలక పాత్ర పోషించారని తెలిపింది. యూఏఈ కేంద్రంగా ఉన్న క్లింగే, చైనా సరఫరాదారుల ద్వారా ఇరాన్‌కు సామగ్రి చేరవేయడంలో భాగస్వామిగా ఉన్నాడని వెల్లడించింది. ఆయన జర్మనీ పౌరుడని యూఎస్ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ గుర్తించింది.
ఈ ఆంక్షలతో ఫార్మ్‌లేన్ కంపెనీ అమెరికా ఆర్థిక వ్యవస్థను ఇకపై వినియోగించుకోలేనని ట్రెజరీ విభాగం స్పష్టం చేసింది. అమెరికాలో ఈ సంస్థకు ఉన్న ఆస్తులను తక్షణమే స్తంభింపజేస్తామని తెలిపింది.
ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి ఆంక్షలను పునరుద్ధరించే భాగంగానే ఈ చర్యలు తీసుకున్నామని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ ప్రతినిధి టామీ పిగాట్ తెలిపారు. 2015 అణు ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని, అందుకే సెప్టెంబర్ 27న యుఎన్ ఆంక్షలు తిరిగి అమల్లోకి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
ట్రెజరీ అండర్ సెక్రటరీ జాన్ హర్లీ మాట్లాడుతూ, “అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్ అణు ముప్పును అడ్డుకోవడమే మా లక్ష్యం. ఇరాన్‌ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి దూరం చేసేందుకు అంతర్జాతీయ సమాజం కూడా పూర్తి స్థాయిలో ఐరాస ఆంక్షలను అమలు చేస్తుందని మేము ఆశిస్తున్నాం” అని తెలిపారు.
ఈ ఆంక్షల జాబితాలో జర్మనీ, ఉక్రెయిన్, తుర్కియే, చైనా, హాంకాంగ్, ఇరాన్ దేశాలకు చెందిన పలు కంపెనీలు, వ్యక్తులు ఉన్నారని, వీరంతా ఇరాన్ కోసం బహుళ సరఫరా నెట్‌వర్క్‌లను నడిపారని ట్రెజరీ విభాగం వెల్లడించింది.