అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఉన్న సైనిక మందుగుండు సామగ్రి కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు పెను విషాదానికి కారణమైంది. ఈ ఘటనలో 19 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వారంతా మరణించి ఉండవచ్చని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నాష్‌విల్‌కు సుమారు 60 మైళ్ల దూరంలోని బక్స్‌నోర్ట్ సమీపంలోని యాక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు తీవ్రతతో ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైపోయింది. మైళ్ల దూరంలోని ఇళ్లు సైతం కంపించిపోయాయి.
ప్రమాద స్థలాన్ని సందర్శించిన హంఫ్రీస్ కౌంటీ పోలీస్ అధికారి క్రిస్ డేవిస్ మాట్లాడుతూ, “చెప్పడానికి ఏమీ మిగల్లేదు, అంతా నాశనం అయిపోయింది. నా కెరీర్‌లో ఇంతటి దృశ్యం ఎప్పుడూ చూడలేదు” అని తెలిపారు. సహాయక బృందాలు అక్కడకు చేరుకున్నప్పటికీ, మరిన్ని పేలుళ్లు సంభవించే అవకాశం ఉండటంతో కొంతసేపు లోపలికి వెళ్లడం కష్టమైంది. అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగించాయి.
ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, పరిసర ప్రాంతాల్లో ఏవైనా గుర్తుతెలియని శకలాలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. టెన్నెస్సీ గవర్నర్ బిల్ లీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, “ఇది చాలా బాధాకరమైన సంఘటన, బాధిత కుటుంబాల కోసం ప్రార్థనలు చేయండి” అని అన్నారు.