తెలంగాణలో పోస్ట్-గ్రాడ్యుయేట్ (పీజీ) వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) శుభవార్త తెలిపింది. శుక్రవారం, రాష్ట్రంలోని 9 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 102 ఎండీ సీట్లను పెంచడానికి ఆమోదం ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ పీజీ సీట్ల మొత్తం సంఖ్య 1,274 నుంచి 1,376కి పెరిగింది. వైద్య విద్య ఆశావహులకు ఇది గొప్ప అవకాశం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కొత్తగా పెరిగిన సీట్లలో అత్యధికంగా హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రి కళాశాలకు 23 సీట్లు కేటాయించబడ్డాయి. తరువాత నల్గొండకు 19, రామగుండం, సూర్యాపేటకు 16 సీట్లు లభించాయి. నిజామాబాద్, సిద్దిపేటలో 8 సీట్లు, ఉస్మానియా, నిమ్స్, మహబూబ్‌నగర్‌లో 4 సీట్లు పెరిగాయి. మొత్తం 16 ఎండీ కోర్సుల్లో ఈ సీట్ల పెంపు జరిగింది. ముఖ్యంగా ఆర్థోపెడిక్స్ 16, పీడియాట్రిక్స్ 14, అనస్థీషియాలో 12, గైనకాలజీలో 10 సీట్లు పెరిగాయి. ఉస్మానియా ఆసుపత్రిలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కొత్తగా 4 ఎండీ సీట్లు పొందాయి.
రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను బలోపేతం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, భద్రాచలం, గజ్వేల్, కింగ్‌కోఠి, మిర్యాలగూడ, పెద్దపల్లి ఆసుపత్రుల్లో రేడియాలజీ, జనరల్ మెడిసిన్ వంటి కీలక విభాగాల్లో మరో 50 డీఎన్‌బీ పీజీ సీట్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేస్తోంది.
అంతేకాక, వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో సూపర్ స్పెషాలిటీ (డీఎం) సీట్ల పెంపు కోసం ప్రతిపాదనలు ఎన్‌ఎంసీకి పంపబడ్డాయి. వీటికి త్వరలోనే అనుమతి పొందుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను తగ్గించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.