బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త: రేపటి నుంచి అదే రోజు చెక్ క్లియరెన్స్
బ్యాంక్ ఖాతాదారులు ఇకపై చెక్ క్లియరెన్స్ కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనల ప్రకారం, అక్టోబర్ 4 నుండి “అదే రోజు చెక్ క్లియరెన్స్” విధానం అమల్లోకి రానుంది. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ సహా ఈ సౌకర్యాన్ని అందించనున్నారు.
ఈ విధానంలో, ఖాతాలో జమ చేసిన చెక్కులు కొన్ని గంటల్లోనే క్లియర్ అవుతాయి. చెల్లింపుల ప్రక్రియ వేగవంతంగా, సురక్షితంగా జరగడానికి RBI ఈ మార్పులు చేపట్టింది. ఖాతాదారులు చెక్కులు బౌన్స్ కాకుండా ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ ఉంచుకోవాలి మరియు చెక్క్ వివరాలను స్పష్టంగా, తప్పులు లేకుండా నింపాలి అని బ్యాంకులు సూచిస్తున్నాయి.
భద్రత పెంచేందుకు పాజిటివ్ పే సిస్టమ్ తప్పనిసరి. రూ.50,000 కంటే ఎక్కువ విలువైన చెక్కులకు, ఖాతాదారులు కనీసం 24 గంటల ముందే అకౌంట్ నంబర్, చెక్ నంబర్, తేదీ, మొత్తం, లబ్ధిదారుడు పేరు వంటి కీలక వివరాలను బ్యాంకుకు అందించాలి. ఈ వివరాలు రిజనల్ ఆఫీస్‌ల ఈ-మెయిల్ ID లకు పంపవలసి ఉంటుంది.
చెక్కును సమర్పించినప్పుడు, బ్యాంకు ముందస్తు వివరాలతో సరిపోల్చి పరిశీలిస్తుంది. అన్నీ సరి ఉంటేనే చెక్ క్లియర్ అవుతుంది, లేకపోతే తిరస్కరిస్తారు. రూ.5 లక్షల పైగా చెక్కుల కోసం పాజిటివ్ పే విధానం తప్పనిసరి అని RBI ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం బ్యాంకులు చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS) ఉపయోగిస్తున్నాయి, దీని వల్ల ATM లేదా డ్రాప్ బాక్స్‌లో వేసిన చెక్కులు క్లియర్ అవడానికి కనీసం రెండు రోజులవుతుంది. కొత్త విధానం ద్వారా ఈ ఆలస్యం పూర్తిగా తొలగి, ఖాతాదారులు తక్షణమే ఫండ్స్ పొందగలుగుతారు.