శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాల బంగారు తాపడం రేకుల్లో 4.54 కిలోల బంగారం మాయం అయిన ఘటనపై కేరళ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
2019లో మరమ్మతుల సమయంలో పాత రాగి రేకులను తొలగించి వాటి బరువు 42.8 కిలోలుగా నమోదు చేశారు. అయితే చెన్నైలోని ఒక సంస్థకు పంపినప్పుడు వాటి బరువు 38.258 కిలోలకు తగ్గింది. దీంతో 4.54 కిలోల వ్యత్యాసం బయటపడింది.
"ఇది అత్యంత తీవ్రమైన, వివరణ లేని తేడా. దీని వెనుక వాస్తవాలను వెలికితీయాల్సిన అవసరం ఉంది" అని జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కేవీ జయకుమార్ వ్యాఖ్యానించారు.
వాస్తవానికి ఈ విగ్రహాలను 1999లో 40 ఏళ్ల వారంటీతో ఏర్పాటు చేశారు. కానీ ఆరు సంవత్సరాల్లోనే లోపాలు రావడంతో మరమ్మతులు అవసరమయ్యాయి. ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు ముందస్తు సమాచారం ఇవ్వకుండా రేకులను తొలగించడం, ఒక భక్తుడి ద్వారా చెన్నైకి పంపడం అనుమానాలకు దారితీసింది.
ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభమవ్వడంతో అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.