ఇక పోస్టాఫీస్ సేవలు మీ స్మార్ట్‌ఫోన్‌లోనే!
స్పీడ్‌పోస్ట్, పార్శిల్ బుకింగ్ కోసం ఇకపై క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు.
భారత తపాలా శాఖ (పోస్టల్ డిపార్ట్‌మెంట్) తన సేవలను ఆధునికీకరిస్తూ “డాక్ సేవ” పేరుతో కొత్త మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా ప్రజలు తమ పార్శిల్, మనీ ఆర్డర్‌లను రియల్ టైమ్‌లో ట్రాక్ చేయడం, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం, ఫిర్యాదులు నమోదు చేయడం వంటి సౌకర్యాలను పొందవచ్చు.
‘ఇక పోస్టాఫీస్ మీ జేబులోనే’ అనే నినాదంతో ఈ యాప్‌ను అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా పరిచయం చేశారు. ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా పార్శిల్ ట్రాకింగ్, పోస్టేజ్ లెక్కింపు, ఫిర్యాదుల నమోదు, ప్రీమియం చెల్లింపు వంటి సేవలను పొందవచ్చు.
డాక్ సేవ యాప్ ద్వారా స్పీడ్‌పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, మనీ ఆర్డర్ వివరాలను రియల్ టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు. అంతేకాకుండా, దేశీయ, అంతర్జాతీయ పార్శిళ్లకు ఖర్చు ఎంత అవుతుందో సులభంగా లెక్కించవచ్చు. ఇకపై స్పీడ్‌పోస్ట్ లేదా పార్శిల్ బుకింగ్ కోసం పోస్టాఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా యాప్ నుంచే బుక్ చేసుకోవచ్చు.
అదనంగా, జీపీఎస్ సదుపాయం ద్వారా సమీపంలోని పోస్టాఫీసుల వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే, కార్పొరేట్ వినియోగదారుల కోసం ప్రత్యేక విభాగంను కూడా ఏర్పాటు చేశారు.
మొత్తం మీద ఈ యాప్ ద్వారా తపాల శాఖ ప్రజలకు మరింత చేరువవుతూ, సేవలను పూర్తిగా డిజిటల్‌గా మార్చే దిశగా ముందడుగు వేసింది.