న్యూఢిల్లీ, అక్టోబర్ 3: రిటైలర్లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అమలు చేస్తున్న GST 2.0 పై వినియోగదారుల నుంచి భారీ ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH) వెల్లడించింది. ఇందులో ఎక్కువ ఫిర్యాదులు పాలు ధరలు, తర్వాత ఎలక్ట్రానిక్స్, ఎల్పీజీ, పెట్రోల్ పై వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
వినియోగదారులు భావించినట్టుగా, GST రీఫార్మ్ తర్వాత పాలు ధరలు తగ్గాలి. కానీ, కంపెనీలు పాత ధరలనే వసూలు చేస్తున్నాయని వారు ఫిర్యాదు చేశారు. దీనిపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) స్పష్టంచేస్తూ, తాజా పాలు ఇప్పటికే GST నుంచి మినహాయింపు పొందిందని, తాజాగా UHT పాలు కూడా మినహాయింపు పొందిందని తెలిపింది.
ఎలక్ట్రానిక్స్ వస్తువుల కొనుగోళ్లపై కూడా ఫిర్యాదులు విస్తారంగా వచ్చాయి. ల్యాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, టీవీలు వంటి వస్తువులు పాత GST రేట్లకే బిల్లు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపించారు. దీనిపై CCPA స్పష్టంచేస్తూ, టీవీలు, మానిటర్లు, ఏసీలు, డిష్‌వాషర్లు GST 28% నుంచి 18%కి తగ్గించబడ్డాయని, ల్యాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు ఇప్పటికే 18% GST కిందనే ఉన్నాయని తెలిపింది.
ఎల్పీజీ సిలిండర్లపై కూడా వినియోగదారులు ధరలు తగ్గలేదని ఫిర్యాదు చేశారు. కానీ CCPA స్పష్టంచేస్తూ, డొమెస్టిక్ LPG సిలిండర్లపై GST 5%గానే కొనసాగుతోందని, ఎటువంటి మార్పు జరగలేదని పేర్కొంది.
అదేవిధంగా పెట్రోల్ ధరలపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై మంత్రిత్వ శాఖ స్పష్టంచేస్తూ, పెట్రోల్ GST పరిధిలోకి రాదని, కాబట్టి ధరలు తగ్గడం జరగదని తెలిపింది.
GST రీఫార్మ్స్ 2025 ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు NCH వద్దకు 3,981 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 31% ప్రశ్నలు, 69% ఫిర్యాదులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 1,992 ఫిర్యాదులు CBICకి పంపగా, 761 ఫిర్యాదులు ఈ-కామర్స్ సంస్థలకు నేరుగా పంపించబడ్డాయి.
ప్రభుత్వం పేర్కొంటూ, ఈ ఫిర్యాదులు వినియోగదారుల అవగాహన పెరిగిందనడానికి, ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం పెరిగిందనడానికి నిదర్శనం అని తెలిపింది.