ఖతార్‌లోని అల్ ఉదెయిద్ అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి జరిగింది. ఇది అమెరికా దాడులకు ప్రతీకార చర్యగా నిర్వహించినట్టు తెలుస్తోంది. ఖతార్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత ఎంబసీ సూచించింది. అలాగే, ఖతార్ గగనతలం మరియు భూభాగం సురక్షితంగా ఉన్నాయని అక్కడి రక్షణ శాఖ భరోసా ఇచ్చింది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగిన నేపథ్యంలో, ఖతార్‌లోని అల్ ఉదెయిద్ అమెరికా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని సోమవారం ఇరాన్ క్షిపణి దాడులు చేశాయి. కానీ, ఖతార్ అధికారులు ఈ దాడులను విజయవంతంగా అడ్డుకున్నట్టు తెలిపారు. ఈ దాడి ఇటీవల జరిగిన అమెరికా అణుకేంద్రాలపై దాడులకు ప్రతీకారం అని అనుకుంటున్నారు.
ఈ పరిణామాల మధ్య, ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడ ఉన్న భారతీయులకు ముఖ్య సూచనలు జారీ చేసింది. ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా “ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఖతార్‌లోని భారతీయులు జాగ్రత్తగా ఉండండి. ఇళ్లలో ఉండి, ప్రశాంతంగా ఉండండి. స్థానిక వార్తలు, ఖతార్ అధికారుల సూచనలు, మార్గదర్శకాలు పాటించండి. రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా కూడా అప్‌డేట్లు అందిస్తుంది” అని పేర్కొంది.
ఖతార్ ప్రభుత్వం ఈ దాడుల వల్ల ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేసింది.
ఇక ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసి, దేశ గగనతలం, భూభాగం సురక్షితంగా ఉన్నట్లు, ఎలాంటి ముప్పును ఎదుర్కొనడానికి సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పౌరులు మరియు నివాసితులు అధికారిక వర్గాల నుండి వచ్చిన సమాచారం మరియు సూచనలను మాత్రమే అనుసరించాలనీ కోరారు.
దీంతో పాటు, రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపినట్లు, ఈ దాడికి ముందు ఇరాన్ రెండు దౌత్య మార్గాల ద్వారా అమెరికాకు సమాచారం అందజేసిందని ఒక సీనియర్ ప్రాంతీయ అధికారి తెలిపారు. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో ఆందోళన కలిగించినప్పటికీ, ఖతార్ ప్రభుత్వం భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది.