'ది 100' సినిమాతో వెండితెరకు వస్తున్న హీరో సాగర్
పోలీస్ ఆఫీసర్‌గా యాక్షన్ స్టార్ట్ | జోరుగా ప్రొమోషన్స్ | ఈ నెల 11న రిలీజ్
'మిస్టర్ పర్ఫెక్ట్' మూవీ అనుభవం పంచుకున్న సాగర్
బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ సంపాదించిన చాలా మంది తర్వాత వెండితెరకు ప్రయాణం మొదలుపెడతారు. అయితే ఆ ప్రయాణం ఎక్కువ కాలం కొనసాగించలేక తిరిగి టీవీకి వెళ్లినవారే ఎక్కువ. కానీ హీరో సాగర్ మాత్రం దీనికి భిన్నం. పట్టుదలతో వెండితెరపై తన స్థానం కోసం ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
ఇప్పుడు ఆయన నటించిన 'ది 100' అనే సినిమా జూలై 11న విడుదలకానుంది. టీవీలో పోలీస్ పాత్రలకు మారుపేరు అయిన సాగర్, ఈ సినిమాలో కూడా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆవేశం, ఆత్మీయత, ఆదర్శం కలగలిసిన పాత్ర ఇది. వినోదానికి తోడు ఓ మంచి సందేశాన్ని కూడా ఈ సినిమా అందించనుంది.
ఈ సినిమాతో రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడిగా పరిచయమవుతుండగా, రమేశ్ కరుటూరి – వెంకీ పూశడపు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
ప్రమోషన్ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ – “నేను ఇకపై వెండితెరపైనే కనిపించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాలో నాకు ఒక ముఖ్యమైన పాత్ర చేసే అవకాశం వచ్చింది. ప్రభాస్ తర్వాత నా పాత్రకి ప్రాధాన్యత ఉంటుందన్నారు. కానీ షూటింగ్ సమయంలోనే అది నిజం కాదని అర్థమైంది. డైరెక్టర్‌ను అడిగినా స్పష్టమైన సమాధానం రాలేదు. అందుకే ఆ మధ్యలోనే సినిమా నుండి తప్పుకున్నా. అయినా ఆ పాత్రను అలాగే ఉంచారు. ఆ సినిమాలో ఆ పాత్ర చేయకపోవాల్సిందని ఇప్పటికీ అనిపిస్తుంది" అని చెప్పారు.