శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మండల పూజల కోసం అధికారికంగా తెరుచుకుంది. భక్తుల శరణుఘోషల నడుమ నిన్న సాయంత్రం 5 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచారు. నూతన మేల్‌శాంతిగా ఎంపికైన ప్రసాద్ నంబూద్రి పవిత్ర పద్దెనిమిది మెట్లు ఎక్కి, సన్నిధానం తలుపులు తెరిచి తొలి పూజలు నిర్వహించారు. దీంతో మండల కాలానికి సంబంధించిన అయ్యప్ప దీక్షల పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
ఈ మండల పూజల సీజన్ కోసం భక్తుల సౌకర్యార్థం కేరళ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పంపా నుంచి సన్నిధానం వరకు ట్రెక్కింగ్ మార్గంలో అనేక తాత్కాలిక వైద్య శిబిరాలు, ఆక్సిజన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ల నుంచి పీజీ విద్యార్థుల వరకు వైద్య సిబ్బందిని 24 గంటలు అందుబాటులో ఉంచారు.
శబరిమల చరిత్రలో తొలిసారిగా పంపా, సన్నిధానం వద్ద ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించారు. పథనంతిట్ట జనరల్ ఆసుపత్రిలో అత్యవసర కార్డియాలజీ సేవలను సిద్ధం చేశారు. తెలుగు, తమిళం, కన్నడ వంటి పలు భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేసి భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర సహాయానికి 04735 203232 హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ప్రకటించారు.
యాత్రకు వచ్చే భక్తులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం సూచించింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తమ వైద్య రికార్డులను వెంట తెచ్చుకోవాలి. కొండ ఎక్కేటప్పుడు నెమ్మదిగా, విరామాలు తీసుకుంటూ ప్రయాణించాలి. ఛాతీ నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగడం, శుభ్రతను కచ్చితంగా పాటించడం మంచిదని సూచించారు.