ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదాయార్జనలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 2025 సెప్టెంబర్ నెలలో రాష్ట్రం రూ.2,789 కోట్ల నికర జీఎస్టీ వసూళ్లు సాధించింది. ఇది గతేడాదితో పోలిస్తే 7.45 శాతం అధికం. స్థూలంగా రూ.3,653 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. రాష్ట్ర జీఎస్టీ (SGST) ద్వారా రూ.1,185 కోట్లు, ఐజీఎస్టీ సర్దుబాటు ద్వారా రూ.1,605 కోట్లు ఖజానాకు చేరాయి.
పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ రూపంలో రూ.1,380 కోట్లు, వృత్తిపన్ను వసూళ్లలో 43.75% వృద్ధి నమోదు కావడం రాష్ట్ర ఆర్థిక బలం పెరుగుతున్న సంకేతంగా అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో వస్తు వినియోగం, వాణిజ్య కార్యకలాపాలు పెరగడమే ఈ వృద్ధికి ప్రధాన కారణమని తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి ఆరు నెలల్లో రాష్ట్ర ఆదాయం మొత్తం రూ.26,686 కోట్లకు చేరింది. ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే గణనీయమైన వృద్ధి. జీఎస్టీ వసూళ్లలో ఈ పెరుగుదల వాణిజ్య పన్నుల శాఖ సమర్థవంతమైన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.