మంగళవారం నుంచి 30 వేల మందిపై వేటు – ఖర్చుల తగ్గింపు, ఏఐ వినియోగమే కారణం
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైంది. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా, మంగళవారం నుంచి ఏకంగా 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. కరోనా సమయంలో పెరిగిన డిమాండ్ కారణంగా అధికంగా నియమించుకున్న సిబ్బందిని తగ్గించుకోవడమే ఈ నిర్ణయానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
మొత్తం 15.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ, ఇందులోని 3.5 లక్షల కార్పొరేట్ సిబ్బందిలో 10 శాతం మందిని తొలగించడం గమనార్హం. 2022లో 27,000 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత, ఇదే అతిపెద్ద లేఆఫ్‌గా నిలవనుంది.
ఈ కోత ప్రభావం హెచ్‌ఆర్, ఆపరేషన్స్, డివైజెస్, సర్వీసెస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) వంటి విభాగాలపై ఉండనుంది. ప్రభావిత సిబ్బందికి మంగళవారం నుంచి ఈమెయిల్ ద్వారా సమాచారం అందించనున్నారు. మేనేజర్లకు సోమవారం ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు సమాచారం.
లేఆఫ్స్ వెనుక కారణాలు?
సీఈఓ ఆండీ జెస్సీ సంస్థలోని అనవసరమైన ప్రక్రియలను తగ్గించడంపై దృష్టి సారించారు. అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరగడంతో పునరావృతమయ్యే పనులు ఆటోమేట్ అవుతుండటం కూడా ఉద్యోగాల కోతకు దారితీసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో అమలు చేసిన “వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాలి” నిబంధన కారణంగా కొందరు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తారని అమెజాన్ ఆశించినా, అది జరగకపోవడం కూడా ఈ భారీ లేఆఫ్స్‌కు కారణమైందని చెబుతున్నారు.
ఇక పండగల సీజన్ దృష్ట్యా, అమెజాన్ 2.5 లక్షల తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవాలని యోచిస్తోంది. మరోవైపు, కంపెనీకి అత్యంత లాభదాయకమైన ఏడబ్ల్యూఎస్ విభాగం వృద్ధి రేటు మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్ కంటే వెనుకబడినట్లు నివేదికలు చెబుతున్నాయి. అమెజాన్ తన మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను గురువారం ప్రకటించనుంది.