స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రకటించిన ప్రకారం, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) ఎగ్జామినేషన్ 2025 ఈ నెల ఆగస్టు 13న దేశవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల పరీక్ష తేదీల్లో మార్పు చేసినట్లు కమిషన్ తెలిపింది.
తాజా సమాచారం ప్రకారం, సీజీఎల్ 2025 పరీక్షను ఇప్పుడు సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ స్పష్టం చేసింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పరీక్షలకు సంబంధించిన సవరించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది.
ఇదిలా ఉండగా, దోస్త్ (DOST) ప్రత్యేక విడత ద్వారా డిగ్రీ సీట్లు పొందిన విద్యార్థుల ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును ఆగస్టు 12 వరకు పొడిగించింది. ముందుగా నిర్ణయించిన ఆగస్టు 6 గడువును రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, సెలవులు కారణంగా పెంచినట్లు కన్వీనర్ వి. బాలకిష్టారెడ్డి తెలిపారు. ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు కూడా ఆగస్టు 14లోపు పూర్తి చేసుకోవచ్చని ఆయన తెలిపారు.