‘టూరిస్ట్ ఫ్యామిలీ’పై నాని ప్రశంసలు: “ఇలాంటి సినిమాలే మనకు అవసరం”
చెన్నై, మే 27:
దర్శకుడు అభిషన్ జీవింత్ తెరకెక్కించిన ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టూరిస్ట్ ఫ్యామిలీ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా పరుగులు తీస్తోంది. తాజాగా ప్రముఖ తెలుగు నటుడు నాని, ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
నాని తన X (ట్విట్టర్) అకౌంట్‌లో ఇలా పోస్ట్ చేశాడు: “సింపుల్, హార్ట్‌వార్మింగ్, మంచి విలువలు కలిగిన సినిమాలే మనకు అవసరం. #TouristFamily ఆ అర్థాన్ని అందించింది. ఈ అద్భుతమైన సినిమాను రూపొందించిన టీమ్‌కు నా ధన్యవాదాలు. ఇది చాలా అవసరమైన సినిమా.”
నాని చేసిన ఈ ట్వీట్‌కు దర్శకుడు అభిషన్ జీవింత్ స్పందిస్తూ “సర్, ఇది పూర్తిగా అనుకోకుండా జరిగింది. మీలాంటి స్టార్ నుంచి వచ్చిన ప్రోత్సాహం మాకు చాలా కీలకం. మీ ట్వీట్ మా రోజుని స్పెషల్‌గా మార్చింది!” అని అన్నాడు.
ఇంతకుముందు సూర్య, రజనీకాంత్, ఎస్.ఎస్. రాజమౌళి, ధనుష్ లాంటి ప్రముఖులు కూడా ఈ సినిమాను ప్రశంసించారు.
డైరెక్టర్ అభిషన్ గత శుక్రవారం తనకు సూర్య ఫోన్ చేసి పేరుతో పిలిచి సినిమా బాగా నచ్చిందని చెప్పిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్‌లో ఆయన ఇలా రాశారు “చెప్పలేనంత ఆనందంగా ఉంది. @Suriya_offl సర్ నన్ను పేరుతో పిలిచి #TouristFamily గురించి చెప్పినప్పుడు నా లోపల ఏదో మళ్లీ నయమైంది.”
అభిషన్ మరోసారి అభిమానం వ్యక్తం చేస్తూ, “నాలో వున్న చిన్నోడు ఇప్పటికీ వారణం ఆయిరం సినిమాను 100వ సారి చూస్తున్నాడు. ఈ రోజు అతను కృతజ్ఞతలతో కన్నీళ్లు పెడుతున్నాడు.” అని చెప్పారు.
ఎస్.ఎస్. రాజమౌళి కూడా ట్వీట్ చేస్తూ,“Tourist Family అనే అద్భుతమైన సినిమా చూశాను. హార్ట్‌టచింగ్ స్టోరీ, హాస్యంతో నిండిన స్క్రీన్‌ప్లే, మొదటి నుండి చివరి వరకు ఆకట్టుకునే కథనం. అభిషన్ జీవింత్ యొక్క రైటింగ్ మరియు దర్శకత్వం చక్కగా ఉంది. తప్పకుండా చూడండి.” అని పేర్కొన్నారు.
మే 1న విడుదలైన ఈ సినిమా ప్రధాన పాత్రల్లో శశికుమార్, సిమ్రన్ నటించగా, యోగిబాబు, ఎంఎస్ భాస్కర్, రమేష్ తిలక్ తదితరులు నటించారు.
షాన్ రెహ్మాన్ సంగీతం అందించగా, అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. భరత్ విక్రమన్ ఎడిటింగ్ చేసారు.
ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్ మరియు ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మించాయి. నిర్మాతలు నసరేత్ బసిలియన్, మహేష్ రాజ్ బసిలియన్, యువరాజ్ గణేశన్.